User Avatar News, Political

కార్యకర్తల జోలికొస్తే ఉపేక్షించం… వైకాపా యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా

కూటమి ప్రభుత్వం నేతలు వైకాపా కార్యకర్తల పై వేధింపులు మానుకోకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని ఆ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా హెచ్చరించారు. రాజానగరంలో “వెన్నుపోటు కు రెండేళ్లు ముగింపు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యారావుపేట కనకదుర్గ గుడి నుండి మండల కార్యాలయాలు, బస్టాండ్, గాంధీ బొమ్మ సెంటర్, వైకాపా సెంటర్ వరకు ప్రభుత్వం వ్యతిరేక నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ చేపట్టారు.  జాతీయ రహదారి పై అర్థ నగ్నంగా నిరసన తెలిపారు. అనంతరం వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి మాజీ ఎమ్మెల్యే రాజా మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపాకు పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. నియోజకవర్గంలో పెళ్లి చేసుకున్న ప్రతి ఆడబిడ్డకు పట్టుచీర, బంగారం మంగళ సూత్రాలు అందిస్తామంటూ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఎన్నికల ప్రచారం చేశారని, అధికారం వచ్చాక చొక్కా ప్యాంటు లాక్కుని పోతుండడంతో అర్ధనగ్నంగా ప్రదర్శన చేశామన్నారు. శ్రీరంగపట్నంలో వైకాపా ఫ్లెక్సీ బోర్డులపై జనసేన ఫ్లెక్సీలు కడుతుండడం, సూర్యారావుపేటలో రేషన్ షాపు నిర్వాహకుడిని షాప్ తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ షాపు తొలగిస్తే అదే కార్యకర్తతో తాను రైస్ షాప్ పెట్టిస్తా…లేదంటే రైస్ మిల్ నే పెట్టిస్తాను… నా ఆస్తులు అమ్మైనా సరే కార్యకర్తలకు అండగా ఉంటానని రాజా ప్రకటించారు. అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ వైకాపా జక్కంపూడి విజయ లక్ష్మి మాట్లాడుతూ తాము ఓడినా నెగ్గినా ఎప్పుడు ప్రజల్లో ఉంటామని, జనం కోసమే జక్కంపూడి కుటుంబం అన్నారు. దీనిలో మండల కన్వీనర్ దూలం పెద్ద, గంగిశెట్టి సోమేశ్వరరావు, మండారపు వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.