User Avatar News

కందుకూరికి హితకారిణి సమాజం నూతన పాలకమండలి నివాళి..

రాజమహేంద్రవరం, నవంబర్ 1: సమాజ సంస్కరణలకు మార్గదర్శకుడైన మహనీయుడు కందుకూరి వీరేశలింగం ఆశయాలను సాకారం చేసేందుకు, ఆయన ఆస్తులను సంరక్షించేందుకు కృషి చేస్తామని హితకారిణి సమాజం నూతన పాలకమండలి చైర్మన్ డా. యాళ్ల ప్రదీప్ సుకుమార్ తెలిపారు. శనివారం ఉదయం స్థానిక వై-జంక్షన్ సమీపంలోని ఆనంద గార్డెన్స్ ప్రాంగణంలో బోర్డు డైరెక్టర్లతో కలిసి కందుకూరి వీరేశలింగం, కందుకూరి రాజ్యలక్ష్మీ అమ్మగారి సమాధుల వద్ద పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కందుకూరి వీరేశలింగం సమాజ హితం కోసం యావదాస్తిని దానం చేశారని, ఆయన స్థాపించిన హితకారిణి సమాజం విద్య, సామాజిక కార్యక్రమాలలో కీలకపాత్ర పోషించిందన్నారు. ఇలాంటి వారసత్వం కలిగిన సంస్థకు రెండవసారి చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించటం గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన కూటమి ప్రభుత్వానికి, కారకులైన రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కి కృతజ్ఞతలు తెలిపారు. పాలకమండలి సభ్యులంతా కలిసి హితకారిణి సమాజం ఆస్తులను కాపాడుతూ, వాటిని సమాజ అభ్యున్నతికి ఉపయోగించేందుకు కృషి చేస్తామన్నారు. విద్యా సంస్థలను మరింతగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. అనంతరం చైర్మన్ కార్యాలయంలో హితకారిణి సమాజం డైరెక్టర్లు ఆదిరెడ్డి వీర వెంకట సత్యనారాయణ, బండారు శ్రీనివాసరావు, మేడపాటి సాయి భాగ్యలక్ష్మి, కె లలితా రాణి, జి శ్యాంసుందర్, సిహెచ్ అనంత సత్య నాగవల్లి, టి శేష రత్నకుమారి లతో సమావేశమై భవిష్యత్తులో చేపట్టవలసిన కార్యాచరణ పై చర్చించారు. ఈ కార్యక్రమంలో హితకారిణి సమాజం, వి.టి జూనియర్ కాలేజ్, ఎస్.కె.ఆర్ ఎం.బి.ఏ, డి. యి.డి మహిళా కళాశాలల సిబ్బంది పాల్గొన్నారు.