User Avatar News

కందుకూరి రాజ్యలక్ష్మి మహిళలందరికీ ఆదర్శం – హితకారిణి సమాజం చైర్మన్ డా. యాళ్ళ ప్రదీప్ సుకుమార్

రాజమహేంద్రవరం, నవంబర్ 5: శ్రీమతి కందుకూరి రాజ్యలక్ష్మి జయంతి సందర్భంగా హితకారిణి సమాజం చైర్మన్ డా. యాళ్ళ ప్రదీప్ సుకుమార్ ఘనంగా నివాళులర్పించారు. బుధవారం ఉదయం స్థానిక వై. జంక్షన్ వద్దనున్న ఆనంద గార్డెన్స్‌లో కందుకూరి వీరేశలింగం మరియు కందుకూరి రాజ్యలక్ష్మి సమాధి మందిరం వద్ద బోర్డు డైరెక్టర్లతో కలిసి ఆయన జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా. ప్రదీప్ సుకుమార్ మాట్లాడుతూ, కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా సాధికారతకు మార్గదర్శకురాలన్నారు. కందుకూరి వీరేశలింగం చేసిన సమాజ సంస్కరణ కార్యక్రమాల వెనుక ఆయన సతీమణి రాజ్యలక్ష్మి తోడ్పాటు ఎంతగానో ఉందన్నారు. వితంతువులను చేరదీసి చదువు చెప్పేవారన్నారు. మహిళా అభ్యున్నతికి ఆమె చూపిన చొరవ మహిళలందరికీ ఆదర్శమన్నారు. తదుపరి ఎస్.కె.ఆర్ ఎంబీఏ మహిళా కళాశాల విద్యార్థినులతో మాట్లాడుతూ, విద్యతో పాటు సేవాభావం కలగలిపితేనే సమాజ అభివృద్ధి సాధ్యమని సూచించారు.ఈ కార్యక్రమంలో బోర్డు డైరెక్టర్లు మేడపాటి సాయి భాగ్యలక్ష్మి, అనంత సత్య నాగవల్లి, కిలారి లక్ష్మి, టిడిపి నాయకులు విశ్వనాథరాజు, హితకారిణీ సమాజం, ఎస్. కె.ఆర్ ఎం.బీ.ఏ, డి.యి.డి కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.