User Avatar News

నన్నయ్య విశ్వవిద్యాలయంలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణు ఫ్లెక్సీ వివాదం

ఆదికవి నన్నయ్య విద్యాలయంలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణు ఫ్లెక్సీ ఎందుకు ఏర్పాటు చేయలేదని అడిగేందుకు వెళ్లిన జనసేన పార్టీ నా సేవా నా వంతు నియోజకవర్గం కో- ఆర్డినేటర్, ఎమ్మెల్యే సతీమణి బత్తుల వెంకటలక్ష్మిని ఉపకులపతి ఆచార్య ప్రసన్న శ్రీ వ్యక్తిగత సహాయకుడు ప్రతాప్ రెడ్డి చేత్తో తోశాడంటూ జనసేన పార్టీ నాయకులు విశ్వవిద్యాలయం గౌతమి బ్లాక్ ఆవరణలో ఆందోళన చేశారు. ఇది తీవ్ర ఉద్రిక్తత ఏర్పడడంతో ఎమ్మెల్యే జోక్యం చేసుకోవడంతో వివాదం సర్దు ముగిసింది. విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కాలేజీ గౌతమి బ్లాక్ నూతన భవనాలు ప్రారంభోత్సవాని రాష్ట్ర ఐటి విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ శుక్రవారం వచ్చారు. దీనికి ముందు మంత్రి లోకేష్ కు జిల్లాలో ఎమ్మెల్యేలు, ఇన్ చార్జిలు స్వాగతం ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యే బత్తుల ఫ్లెక్సీలు లేకపోవడంపై ఎమ్మెల్యే సతీమణి, నా సేవా నా వంతు కో- ఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి ఉపకులపతిని అడగడానికి వెళ్ళగా ఆమెను వ్యక్తిగత సహాయకుడు ప్రతాప్ రెడ్డి చేతులు అడ్డుపెట్టారు.  దీనిపై వెంకటలక్ష్మి తో ఉన్న పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసి ప్రతాప్ రెడ్డిని కొట్టినట్లు తెలిసింది. అనంతరం ఉపకులపతి వ్యక్తిగత సహాయకుడు ఎమ్మెల్యే సతీమణి, పార్టీ నాయకురాలు వెంకటలక్ష్మిని భుజంపై చేత్తో తోశాడంటూ నాయకులు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌతమి బ్లాక్ బయట ఉపకులపతికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, జనసేన నాయకులకు వివాదం ఏర్పడి ఉద్రిక్తతకు దారితీసింది. అయితే ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, సతీమణి వెంకటలక్ష్మి అక్కడే ఉండి కార్యకర్తలు నాయకులను ప్రశాంతంగా ఉండాలని కోరారు. దీనిపై ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో అధికారులు చిన్న చిన్న తప్పులు ఉన్న సర్దుకు పోవాలన్నారు. జిల్లాలో అందరి ఎమ్మెల్యేలు ఫ్లెక్సీలు పెట్టి స్ధానిక ఎమ్మెల్యే పెట్టకపోవడం పై తనకు ఎటువంటి అభ్యంతరం లేదని ప్రజల గుండెల్లో ఎప్పుడూ ఉంటానని చెప్పారు. ఉపకులపతి తీరు వైకాపా నాయకురాలుగా ఉన్న విధంగా ఉందని అసహనం వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యలు మానుకోవాలి హితవు పలికారు. దీనిలో కానవరం వ్యవసాయ సొసైటీ అధ్యక్షుడు నాతిపాం దొరబాబు, శ్రీకృష్ణపట్నం సర్పంచ్ కిమిడి శ్రీరాం, మండల కో- ఆర్డినేటర్ వేంగిశెట్టి రాజు, అడపా శ్రీనివాస్ పార్టీ నాయకురాలు, కార్యకర్తలు పాల్గొన్నారు. దీనిపై ఉపకులపతి ఆచార్య ప్రసన్న శ్రీ వివరణ కోరగా ఏ వివాదం లేదన్నారు.