User Avatar others

జాతీయ ఎస్టీ కమీషన్‌ సిఫార్సులు అమలు చేయాలి..

జాతీయ ఎస్టీ కమీషన్‌ సిఫార్సులు అమలు చేయాలి..
రాజమహేంద్రవరం :
జాతీయ ఎస్టీ కమీషన్‌ 2018లో పోలవరం ముంపు ప్రాంతాల్లో పర్యటించి రాష్ట్రపతికి ఒక నివేదిక సమర్పించం జరిగిందని, ఆ నివేదిక ప్రకారం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఎస్టీ కమీషన్‌ సిఫార్సులను బుట్టదాఖలు చేసారని ఆదివాసీ మహా సభ న్యాయసలహాదారు అయినాపురపు సూర్యనారాయణ విమర్శించారు. ది రాజమండ్రి ప్రెస్‌క్లబ్‌లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలవరం ఎస్టీ నిర్వాసితుల విషయంలో చట్టాలను ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులలో 53శాతం మంది గిరిజనులున్నారని, వీరి విషయంలో ప్రభుత్వం, అధికారులు చట్ట విరుద్ధంగానే వ్యవహరిస్తు కోర్టు ధిక్కారణకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ చట్ట ఉల్లంఘన నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, ఇందుకు బాధ్యులైన వారందరూ బియన్‌యస్‌ 111 ప్రకారం నేరం చేసినట్లుగానే భావించి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసారు. కొత్త భూసేకరణ చట్టం`2013 ప్రకారం భూమి కావలసిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ ముందుగా జిల్లా కలెక్టర్కు, ఆర్‌ అండ్‌ ఆర్‌ కమీషనర్‌కు లేఖ రాసి వారు అనుమతించిన తరువాత భూసేకరణకయ్యే సొమ్మును ప్రభుత్వం డిపాజిట్‌ చేయాలని ఈ నిబంధన ఎక్కడా అమలు చేయడం లేదన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ 11.80 లక్షల వరకు చెల్లించాల్సి ఉందన్నారు. కొత్త భూసేకరణ చట్టం రూల్‌ 24 ప్రకారం భూమిలేని ఎస్సీ, ఎస్టీ నిర్వాసితులకు ఒక్కొక్క కుటుంబానికి కనీసం ఎకరం భూమి కేటాయించాలని డిమాండ్‌ చేసారు. ఈ విధంగా చట్టాలను కోర్టు ఆదేశాలను ప్రభుత్వం నిరంతం ధిక్కరిస్తుందని, ప్రధానంగా ఆర్‌ అండ్‌ ఆర్‌ కమీషనర్‌, భూసేకరణాధికారులు, జిల్లా కలెక్టర్లు, పోలవరం ఆర్‌ అండ్‌ ఆర్‌ అడ్మినిస్ట్రేటర్‌, ఆర్‌ అండ్‌ ఆర్‌ ఆఫీసర్లుగా వున్న సబ్‌ కలెక్టర్లు, సంబంధిత ఇంజనీర్లు, ఈ మేరకు నిరంతరం చట్టాలను ఉల్లంఘిస్తున్న నేరాలలోకి వస్తారని పేర్కొన్నారు. వీరిపై బియన్‌యస్‌ 111 ప్రకారం మరియు ఎస్సీ, ఎస్టీ చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి విచారణ జరిపించాలని, పోలవరం నిర్వాసితులైన ఎస్టీలకు న్యాయం జరిగేవిధంగా పోలవరం ముంపు ప్రాంతంలో పర్యటిస్తున్న ఎస్టీ కమీషన్‌ చర్యలు తీసుకోవాలని ఆదివాసీ మహాసభ డిమాండ్‌ చేస్తుందన్నారు. గిరిజనులకు సరైన న్యాయం చేసే వరకు వారికి అండగా ఉంటామని స్పష్టం చేసారు. దీనిలో నెసిక లక్ష్మణరావు, బూరమ్మ, వీరమ్మ, రాజమణి, కె.కృష్ణవేణి, భీమయ్య, ఎన్‌.పార్వతి, పోసిరావు, రమేష్‌, వెంకటేశ్వరరావు, అన్నిక బాపనమ్మ, మద్దిపాటి సతీష్‌, వేమగిరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.