User Avatar Education

నాణ్యత లేని విద్య – విద్యా శాఖ అధికారుల చేతివాటం

ప్రైవేట్ కళాశాలలు, విద్యా సంస్థలకు లక్షలాది రూపాయలు చెల్లించి మెరుగైన విద్యను పిల్లలకు అందించాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. కనీసం సౌకర్యాలు లేకుండా నాసిరకం విద్యతో నిబంధనలు విరుద్ధం కళాశాలలు కొనసాగుతున్నాయి. వీటిని పర్యవేక్షించాల్సిన విద్యా శాఖ అధికారులు మామోళ్ళు తీసుకుని అటు వైపు కన్నెత్తి చూడడం లేదు. జిల్లాలో సుమారు 650 ప్రైవేట్ కళాశాలలు, విద్యా సంస్థలు ఉన్నాయి. వీటిలో సగానికిపైగా ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా శాస్వత బిల్డింగ్స్ లో విద్యా బోధన జరిపి, విద్యార్థినులకు ప్రత్యేక మరుగుదొడ్లు, క్రీడా మైదానం, పరిశుభ్రమైన తాగునీరు, వాహనాలకు ఆర్టీఒ అధికారుల ఫిట్నెస్ సర్టిఫికెట్, అగ్ని మాపకదళం అధికారుల నుండి ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ తదితరులు అనుమతులు ఉండాలి. ప్రైవేట్ కళాశాలలు ప్రారంభించడానికి ముందుగా పై నిబంధనలు ఏర్పాటు చేసుకుని విద్యాశాఖ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. ఇవి అన్నీ పరిశీలించి పర్యవేక్షణ చేసిన తర్వాత విద్యా శాఖ అధికారులు అనుమతులు మంజూరి చేస్తారు. ఇవి పూర్తిగా లేకపోయినా విద్యా శాఖ అధికారులు అనుమతులు మంజూరు చేస్తున్నారు. పశువుల కోసం ఏర్పాటు చేసిన సిమెంట్ రేకుల షెడ్లు లాంటి వాటిలో ప్రైవేట్ కళాశాలలు కొనసాగుతున్నాయి. విద్యార్ధులకు కనీసం సదుపాయాలు పరిశుభ్రమైన మంచినీరు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం లేదు. అనుభవం ఉన్న ఉపాధ్యాయులు ఉన్నారని భారీ ప్రచారం చేస్తారు కానీ విద్యార్హత లేని ఉపాధ్యాయులు తరగతులను బోధిస్తున్నారు. ఉదాహరణకు రాజానగరం మండలంలో తూర్పు గానుగూడెం సమీపంలో ఒక ప్రైవేటు కళాశాల పూర్తిగా నిర్మాణం జరగకుండా మండల విద్యా శాఖ అధికారులు గత ఏడాదే అనుమతులు మంజూరు చేశారు. ఈ కళాశాలలో చేరిన విద్యార్థులు రాజానగరం ప్రముఖ విద్యా సంస్థల అనుబంధ కళాశాలలో చదివారు. గత ఏడాది కొనసాగుతున్నట్లుగా అనాధికార అనుమతులు మంజూరి చేసినందుకు సుమారు నాలుగు లక్షల రూపాయలు మామోళ్ళు గా విద్యా శాఖ అధికారులు తీసుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇదేవిధంగా మండలంలో ప్రతి ప్రైవేట్ కళాశాల నుండి నిబంధనలు పేరుతో భారీ గా డబ్బులు వసూళ్లు చేశారని ప్రచారం జరుగుతుంది. ఇలాగే జిల్లా విద్యా శాఖ అధికారులు డబ్బులు తీసుకుని ప్రైవేట్ కళాశాల అనుమతులు మంజూరు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. విద్యా అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్న ప్రభుత్వం ఆ శాఖ అధికారులు మోకాళ్ళ అడ్డు పెడుతుండడం విశేషం. దీనిపై విద్యార్ధి సంఘాలు, పిల్లల తల్లిదండ్రులు స్పందించాలి. అవినీతి అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. లేనిచో విద్య శాఖపై ప్రభుత్వం లక్ష్యం నెరవేరదు.