User Avatar others

ప్రభుత్వ సీలింగ్ భూమి ఎల్ సి సి నెం 59/Rjy /75 లో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలి… . సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ

జిల్లాలో గోకవరం మండలం గంగంపాలెంలో 1993 నుండి 37 కుటుంబాల వారు సాగు చేసుకుంటున్న పేదల భూముల్లో అక్రమ రిజిస్ట్రేషన్ నిలుపుదల చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు డిమాండ్ చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్ కార్యాలయం‌ ఆవరణలో ధర్నా చేసి జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మండవ దుర్గాప్రసాద్, పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్ శ్రీమన్నారాయణ, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు జనపల్లి సత్తిబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా వెంకట నాయుడు మాట్లాడుతూ 37 కుటుంబాల వారు సాగు చేసుకుంటున్న భూమి అక్రమ రిజిస్ట్రేషన్ చేస్తున్నారని ఆరోపించారు. దీనిని సాకుగా చూపించి పేదలను కోర్టు చుట్టూ తిప్పుతూ మానసికంగా, ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నారన్నారు. దీనిపై ప్రభుత్వం ఇంప్లీడ్ పిటిషన్ వేసి పేదలకు న్యాయం చేయాలని కోరారు. దీనిలో కాండ్రేగుల నాగమణి, పందిరి త్రిమూర్తులు, దేశ గౌరమ్మ,కను సు నూకరాజు దొర,కను సుసూరిబాబు దొర,చిన్న అప్పారావు,భద్రం, తదితరులు పాల్గొన్నారు.