User Avatar others

24 న డాక్టర్ బిఆర్ అంబేద్కర్”బుద్ధునితో నా ప్రయాణం” నాటక ప్రదర్శన 

రాజమహేంద్రవరం, జూలై 22: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బుద్ధిజం స్వీకరించడానికి గల కారణాలను సహేతుకంగా వివరించే “బుద్ధునితో నా ప్రయాణం” తెలుగు నాటక ప్రదర్శన ఈనెల 24 వ తేదీ సాయంత్రం 6 గంటలకు శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో జరుగుతుందని దళిత గిరిజన ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకుడు మర్రి బాబ్జి చెప్పారు.అంబేద్కర్ భవన్ లో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1956 లో నాగపూర్ లో అంబేద్కర్ బుద్ధిజం స్వీకరించి తద్వారా దేశంలో అధిక శాతం నివసించే పేద దళిత గిరిజన ప్రజలకు మార్గదర్శనం చేశారని తెలిపారు.ఈ దేశానికి బుద్ధిజం శరణ్యమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పష్టం గా చెప్పారని మర్రి బాబ్జి వివరించారు.బుద్ధిజం స్వీకరించిన క్రమంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు కలిగిన అనుభవాలు, అనుభూతిని “బుద్ధునితో నా ప్రయాణం” నాటకంలో విపులంగా చర్చించారని ఆయన చెప్పారు.దేశంలోని దళిత గిరిజన, దిగువ మధ్యతరగతి ప్రజలకు అనేక హక్కులు, అవకాశాలు కల్పిస్తూ అంబేద్కర్ రాజ్యాంగ రచన చేశారని, అయితే దేశంలో అణగారిన వర్గాలకు ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించేందుకు బుద్ధిజం స్వీకరించడమే‌ సరైన మార్గమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వసించారని,తాను నమ్మినదాన్ని ఆచరించారని ఆయన అన్నారు.అదంతా ప్రజలకు తెలియ చేసేందుకు బుద్ధునితో నా ప్రయాణం నాటకం రచించారని,ఆ నాటకాన్ని అభ్యుదయ ఆర్ట్స్ అకాడమి బేనరుపై దళిత గిరిజన ప్రజా సంఘాల తరుపున ఈ నాటక ప్రదర్శన నిర్వహిస్తున్నామని మర్రి బాబ్జి చెప్పారు. కుటుంబ సమేతంగా అందరూ హాజరై నాటక ప్రదర్శన తిలకించాలని ఆయన కోరారు.సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కాశీ నవీన్ కుమార్,మాజీ కార్పొరేటర్ అజ్జరపు వాసు, స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రే కొండబాబు, దళిత నాయకులు కోరుకొండ చిరంజీవి,‌బీఎస్పీ నాయకుడు ఇసుకపట్ల రాంబాబు,బద్దే జార్జి ఆంటోని, బీఎస్పీ నాయకుడు పట్నాల విజయకుమార్, దారాఏసురత్నం, సి.హెచ్.కూర్మయ్య, జంగాసుబ్బారావు,సోమాబత్తుల విజయకుమార్ పాల్గొన్నారు.